సెప్టెంబర్ 30లోపు ఉద్యోగుల సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి.
పెండింగ్ ఉద్యోగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీర్మానం!
అర్జున్ సమాచారం జులై 05 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
మంచిర్యాల, ఆగస్టు 05:మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవనంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరూ సెప్టెంబర్ 30లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేసి రాష్ట్రంలోనే వంద శాతం లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల వ్యవధిలో ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) సేవలను అభినందించారు.
సమావేశంలో ఉద్యోగుల పలు సమస్యలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు కరవు భత్యాల విడుదల, వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, ఉద్యోగుల ఆరోగ్య కార్డును కుటుంబ సభ్యులందరికీ వర్తింపజేయడం, కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పదిహేడు శాతం ఇంటి అద్దె భత్యం మంజూరు చేయడం, మిగిలిన ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ తీర్మానాలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
ఇటీవల జైపూర్ మండల అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి బాపురావును జిల్లా కమిటీ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపింది. జిల్లా కమిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష పదవికి సహ ఎంపిక విధానంలో నడిమెట్ల సత్యనారాయణను ఎన్నుకొని సన్మానించారు.
సమావేశంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాణి అంజయ్య, తిరుపతి, రామ్ కుమార్, నరేందర్, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, పద్మలత, క్రీడల కార్యదర్శి కుమార్, మంచిర్యాల విభాగం అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి విభాగం అధ్యక్షుడు సుమన్, లక్షెట్టిపేట విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్, బెల్లంపల్లి విభాగం కార్యదర్శి క్రాంతితో పాటు పలువురు పాల్గొన్నారు